- వంగరలో రూ.7 కోట్లతో పీవీ విజ్ఞాన వేదిక
- పెండింగ్ వర్క్స్ వల్ల ఓపెనింగ్ వాయిదా
- పనుల పూర్తికి మరో రూ.6 కోట్లు అవసరం
హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: భారతరత్న, మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావు జీవిత విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడంతో పాటు ఆయన స్మారకార్థం స్వగ్రామం హనుమకొండ జిల్లా వంగరలో గత ప్రభుత్వం ‘పీవీ విజ్ఞాన వేదిక' పనులు ప్రారంభించింది. కానీ, నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పనులు పూర్తి కాలేదు. రూ.7 కోట్లతో నిర్మించిన విజ్ఞాన వేదికను గతేడాది పీవీ జయంతి సందర్భంగానే ప్రారంభించాలనుకున్నప్పటికీ పెండింగ్ పనుల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. పనుల పూర్తికి మరో రూ.6 కోట్లు అవసరం ఉంది. రెండు నెలల్లోనే పీవీ 105వ జయంతి జరగనుండగా.. అప్పటిలోపైనా పనులన్నీ పూర్తి చేసి పీవీ విజ్ఞాన వేదికను అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో డెడ్ స్లో
పీవీని గుర్తు చేసుకుంటూ.. గత ప్రభుత్వం రూ.11 కోట్లతో వంగరను టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చింది. ఆయన జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా దాదాపు ఏడెకరాల స్థలంలో 'పీవీ విజ్ఞాన వేదిక' పనులు చేపట్టి ఏడాదిలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పింది. మొదటి విడతలో రూ.7 కోట్లతో పీవీ విజ్ఞాన వేదిక, మరో రూ.4 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. 2021 ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ చేసినప్పటికీ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పనులు నెమ్మదిగా సాగాయి.
మరో రూ.6 కోట్లు అవసరం
పీవీ విజ్ఞాన వేదికలో ఇప్పటికే సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. గతేడాది ఓపెనింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ పెండింగ్ పనులపై ఆరా తీశారు. ఆ తరువాత సెకండ్ ఫేజ్ లోని పనుల పూర్తికి ప్రపోజల్స్ సమర్పించాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు రూ.6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ నిధులతో పీవీ స్టాట్యూ విత్ ఫౌంటేన్, మ్యూజియంలో ఫర్నీచర్, ఏసీపీలు, మెడిటేషన్ సెంటర్ రూఫ్, ఎక్స్ టర్నల్ లైటింగ్, జిమ్ ఐటమ్స్, వాటర్ సప్లై సిస్టం, పాత్ వేస్, పార్కింగ్ ఏరియా డెవలప్మెంట్, ఫుడ్ కోర్టు, హెచ్టీ ట్రాన్స్ ఫార్మర్, హనుమకొండ-సిద్దిపేట హైవే వద్ద ఆర్చ్ నిర్మించాలని ప్రతిపాదించారు.
మరో రెండు నెలల్లోనే జయంతి
పెండింగ్ పనులు, ఆఫీసర్లు చొరవ చూపకపోవడంతో పీవీ విజ్ఞాన వేదిక ఓపెనింగ్ కు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ 28న జరిగే పీవీ 105వ జయంతికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. పెండింగ్ పనులపై ఇప్పటినుంచే కసరత్తు చేస్తేనే జయంతి నాటికైనా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇకనైనా జయంతి నాటికి పనులన్నీ పూర్తి చేసి పీవీ విజ్ఞాన వేదికను అందుబాటులోకి తీసుకురావాలని, ఆ దిశగా లీడర్లు, ఆఫీసర్లు చొరవ చూపాలని స్థానికులు, పీవీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.7 కోట్ల పనులు కంప్లీట్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్టార్ట్ అయినప్పటికీ ఫండ్స్ సకాలంలో రిలీజ్ చేయకపోవడం, అప్పటి లీడర్లు కూడా పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింతరువాత రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో పీవీ విజ్ఞాన వేదిక పనులను స్పీడప్ చేశారు. పెండింగ్ నిధులు విడుదల చేయించి సివిల్ వర్క్స్ కంప్లీట్ చేయించారు.
రూ.7 కోట్లతో ఆడిటోరియం, సైన్స్ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, సెమినార్ హాల్, యాంపీ థియేటర్, మెడిటేషన్ సెంటర్ తదితర వర్క్స్ చేపట్టి, విజ్ఞాన వేదిక పనులను చివరి దశకు తీసుకొచ్చారు. దీంతో గతేడాది జూన్ 28న పీవీ 104వ జయంతి సందర్భంగా విజ్ఞాన వేదికను ఓపెనింగ్ చేయాలని భావించారు. ఆ తరువాత ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ సెకండ్ ఫేజ్ లో చేపట్టాల్సిన వర్క్స్ పెండింగ్ లో ఉండటంతో ప్రారంభోత్సవాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు.

